ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.5900 కోట్లు
టోకెన్లు ఇచ్చింది 1,200 కోట్లకు.. టోకెన్లు ఇచ్చీ ఏడాదాయే..
ఈనెల 4న హెచ్చరించిన ‘విజయక్రాంతి’
హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధు లు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలు బంద్‌ను పాటించ నున్నాయి.
బకాయిలు చెల్లించనందుకు నిరసనగా దసరా సెలవుల తరు వాత కళాశాలలు మూసివేయాలని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆలోచించింది. ఈ లోపు ప్రభుత్వం స్పందించి బకాయిలను రిలీజ్ చేస్తే కళాశాలలు షెడ్యూల్ ప్రకారం తెరుస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కళాశా లలను మూసివేసేందుకే అసోసియేషన్ నిర్ణయించింది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ‘బంద్’కు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఈ నెల 4న విజయక్రాంతి దినపత్రికలో ‘దసరా తరువాత కాలేజీలు బంద్’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు నడుపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేసే పరిస్థితి ఉందని పేర్కొంది.
రూ.5,900 కోట్ల బకాయిలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్స్ కళాశాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం నుంచి రూ.5,900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అసోసియేషన్లు చెప్తున్నాయి. ఇందులో ఇప్పటికే రూ.1,200 కోట్లకు ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది. అయితే, ఈ టోకెన్లు ఇచ్చీ దాదాపు సంవత్సరం గడుస్తోంది.
ఇలా టోకెన్లు ఇచ్చిన వాటిలో రూ.650 కోట్లు కేవలం ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంటర్ కళాశాలలకు రిలీజ్ చేయాల్సి ఉంది. మిగతా మొత్తం ఇతర కళాశాలలకు విడుదల చేయాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో ఈ టోకెన్లు ఇచ్చిన మొత్తం కేవలం 20 శాతం మాత్రమే కావడం గమనార్హం. దాదాపు యేడాది కావొస్తున్నా.. ఆ నిధులు మాత్రం విడుదల చేయడం లేదని అసోసియేషన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
ఇంజినీరింగు కళాశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం ఏటా రూ.1,250 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య 10 లక్షలకుపైగానే ఉంటుందని అసోసియేషన్లు పేర్కొంటున్నాయి.
2021 20 శాతం, 2022 70 శాతం, 2023 సంవత్సరానికి సంబంధించి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దాదాపు 10 నెలల క్రితం కళాశాలల కోసం రూ.1,200 కోట్ల టోకెన్లు విడుదల చేశారు. అయినా, ఆ మొత్తానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి.
13 లక్షల మందిని ఆదుకోవాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఎక్కువగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులే లబ్ధి పొందుతారు. చాలా కాలం నుంచి ఈ బకాయిలు పెరిగిపోవడంతో కళాశాలల్లో అధ్యాపకులకు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 11 లక్షల మంది విద్యార్థులు.. సుమారు 2 లక్షల మంది అధ్యాపకులు, సిబ్బంది.. మొత్తంగా 13 లక్షల మంది ఆధారపడి ఉన్నారు.
టోకెన్లు విడుదల చేసిన రూ.1,200 కోట్లన్నా రిలీజ్ చేయాలి. ఇందుకోసం రాష్ట్రంలోని మంత్రులను, ప్రభుత్వ సలహాదారుని, ఉన్నతాధికారులను ఎన్నోసార్లు కలిసి విన్నవించాం. దసరా తరువాత కళాశాలలను నిర్వహించలేమని అన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు, స్టేట్ కౌన్సిల్ చైర్మన్‌కు కూడా వినతిపత్రాలు ఇచ్చాం. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో దసరా కూడా సరిగా జరుపుకోలేకపోయాం.
విధిలేని పరిస్థితుల్లో కళాశాలను నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరోక్షంగా ప్రభుత్వమే కళాశాలలకు కల్పించిన ఒక నిస్సహాయ స్థితిగా భావిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలి.
డాక్టర బొజ్జా సూర్యనారాయణరెడ్డి, యాద రామకృష్ణ,
తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు