23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : కలెక్టర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగణంగా పనిచేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లా డారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎల్‌ఆర్‌ఎస్, ఇం దిరమ్మ ఇండ్ల పథకం, భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నదని, కలెక్టర్లు ఆ అం శాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భూభారతి చట్టంపై సమగ్రంగా అధ్యయనం చేసి, చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్బోధించారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లా లిం గంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటివరకు నేలకొండపల్లి మండలం నుంచి 1,076, మద్దూర్ మండ లం నుంచి 233, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నుంచి 810, ములుగు జిల్లా వెంక టాపురం మండలం నుంచి 3,786.. ఇలా మొత్తం 5,905 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఆయా మండలాల్లో విజయవంతంగా రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
మే మొదటి వారంలో హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసి, మొత్తం 28 మండలాల్లో చట్టాన్ని అమలు చేస్తామని వివరించారు. ఇప్పటివరకు 159 మండలాల్లో భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించామని వెల్లడించారు.
యుద్ధప్రాతిపదికన ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక..
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు యుద్ధప్రాతిపదికన లబ్ధిదారుల ప్రక్రియ చేపడతామని, మే మొదటివారంలోపు ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తర్వాత ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రతి 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి, అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు.
దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తామని తేల్చిచెప్పారు. ఇంటి నిర్మాణానికి తక్కువ ధరకు స్టీల్, సిమెంట్ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ , జగిత్యాల , నిజామాబాద్, వనపర్తి, మంచిర్యాల, గద్వాల జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ఆశించిన స్థాయిలో లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంచేది లేదు
ఎల్‌ఆర్‌ఎస్ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుందని, ప్రభుత్వం మరో సారి గడువు పెంచబోదని మంత్రి స్పష్టం చేశారు. గడువు మరో వారం మాత్రమే ఉన్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడు వు ముగిసిన తర్వాత 25 శాతం రాయితీ వర్తించని తేల్చిచెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్టాం ప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సీసీఎల్‌ఏ డైరెక్టర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.