calender_icon.png 28 December, 2024 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగురాలికి కలెక్టర్ చేయూత

21-12-2024 03:01:15 AM

రుణం మంజూరు చేయించి ఆదుకున్న ముజమ్మిల్‌ఖాన్ 

ఖమ్మం, డిసెంబర్ 20 (విజయక్రాంతి): దివ్యాంగురాలి దుస్థితికి చలించిపోయిన ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆమెకు రుణం మంజూరు చేయించి చేయూతనందించారు. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన నిరుపేద దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల తోపుడు బండి మీద పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది.

ఐదు రోజు క్రితం నగరంలో పర్యటిస్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తన కారును ఆపి కమల వద్దకు వెళ్లి పలకరించారు. తనకు అమ్మ మాత్రమే ఉన్నదని, నాన్న లేడని.. కుటుంబం గడవడం ఎంతో కష్టంగా ఉన్నదని కమల కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. చలించిపోయిన కలెక్టర్ తాను ఆదుకుంటానని భరోసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసి కమల పరిస్థితిని వివరించారు. ఆమెకు ఆదరువు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే కమిషనర్ నేతృత్వంలో ఒక బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి కేవలం అయిదు రోజుల్లోనే ఆమెకు రూ.లక్ష రుణం మంజూరు చేయించి, శుక్రవారం అందజేశారు. కమలతో కూరగాయల వ్యాపారం ఏర్పాటు చేయించాలని కలెక్టర్, కమిషనర్ భావిస్తున్నారు. కలెక్టర్‌కు కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతోంది.