calender_icon.png 19 March, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్వ మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

19-03-2025 12:54:06 AM

నారాయణపేట. మార్చి 18(విజయక్రాంతి) : నారాయణ పేట జిల్లాలోని యాస్పిరేషన్ బ్లాక్ అయిన నర్వ మండలంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళ వారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా నర్వ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని, ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఎలా రాశారని అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, ఎండలు ఎక్కువగా ఉన్నాయని, విద్యార్థులు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. గతేడాది పాఠశాల ఉత్తీర్ణత శాతం 100 శాతం ఉందని, ఈ సారి కూడా వంద శాతం సాధించాలని, 10 జీపీఏ కూడా చాలా మంది విద్యార్థులకు రావాలన్నారు.

పాఠశాల ఆవరణలో ఆరు బయట వంట చేస్తుండటంతో వంట గది ఉన్నా ఎందుకు బయట వండు తున్నారని,వంట గదిలో వండాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆమె సూచించారు. వంట గదిలో నిత్యావసర సరుకుల ను పరిశీలించిన కలెక్టర్ ఫాం ఆయిల్ ను వినియోగించ వద్దని ఆదేశించారు. పక్కనే ఉన్న ఆర్వో ప్లాంట్ ను చూశారు. ఆర్వో ప్లాంట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

ఆర్వో ప్లాంట్ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని, పారిశుద్ధ్య కార్మికుల చేత పరిసరాలను శుభ్రం చేయించాలని పాఠశాల హెచ్ ఎం, ఏంఈవో రామకృష్ణ కు సూచించారు. పాఠశాలకు శానిటేషన్ నిధులు ఎన్ని మంజూరు అయ్యాయని పృశ్నించగా తమ పాఠశాలకు శానిటేషన్ నిధులు రాలేదని హెచ్ ఎం చెప్పడంతో వెంటనే కలెక్టర్ అక్కడి నుంచే జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు కు ఫోన్ చేసి మాట్లాడారు.

నర్వ జెడ్పీ స్కూల్ కి శానిటేషన్ నిధులు ఎన్ని మంజూరయ్యాయి? ఎన్ని విడుదల చేశారో నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, నర్వ తహాసిల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పిహెచ్ సీ వైద్యులు, ఎంపీఓ, ఎపీఓ ఆ మండల అధికారులు పాల్గొన్నారు.