calender_icon.png 18 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార పట్టిన కలెక్టర్

26-03-2025 01:41:10 AM

 కూలీ అవతారమెత్తిన రిజ్వాన్ బాషా షేక్

జనగామ,  మార్చి 25(విజయక్రాంతి): సూటుబూటు మీద ఎప్పుడూ హడావిడిగా కనిపించే జనగామ కలెక్టర్ ఒక్కసారిగా కూలీ అవతారమెత్తారు. ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన ఆయన పలుగు, పార చేతబట్టి కూలీలతో మమేకమయ్యారు. కాసేపు గడ్డపారతో మట్టిని తవ్వి కూలీగా మారిపోయారు.

ఈ అరుదైన సన్నివేశం మంగళవారం జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ శివారులో కనిపించింది. అక్కడ ఉపాధి హామీ కింద ఆర్సీబీ రోడ్డు పనులను పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. కూలీలు చేస్తున్న పనిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ తాను కూడా ఓ చెయ్యి వేశారు. కాసేపు వారితో కలిసి పలుగు, పార చేతబూని పనుల్లో పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

కూలీల సమస్యలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్వయంగా కలెక్టర్ తమతో కలిసి పనిచేయడం, వారి సమస్యలను తెలుసుకోవడంపై కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. వేసవి కావడంతో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేశారు.  డీఆర్డీఏ వసంత, ఎంపీడీవో శ్రీనివాస్ ఉన్నారు.