27-04-2025 12:08:45 PM
అందరికీ ఆదర్శం....
ఆయన నిర్ణయం..
గోదావరిఖని ధర్మాసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం
పండంటి మగ బిడ్డకు జననం..
మొదటినుంచి ధర్మసుపత్రిలోనే వైద్యం
గోదావరిఖని,(విజయక్రాంతి): ఆయన ఒక జిల్లాకే రథసారథి... కావాలనుకుంటే కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకోగలరు... కానీ ఆయన అలా చేయలేదు... ఓ సాదాసీదా వ్యక్తిగా... సామాన్యుడిగా నడిచి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన భార్యను మొదటినుండి ధర్మాస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయిస్తూ... శనివారం రాత్రి అదే ప్రభుత్వ దవాఖానాలోనే కాన్పు చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఆయన నిర్ణయం కు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఆ కలెక్టర్... నిజమైన ఆఫీసర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఎవరంటే... పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Peddapalli District Collector Sri Harsha). జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విద్య, వైద్యం తదితర ప్రభుత్వ సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో తన భార్య విజయ రెండో కాన్పు కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా గోదావరిఖని ధర్మాసుపత్రిలో నే మొదటినుంచి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులు రావటం తో శనివారం రాత్రి అదే ధర్మసుపత్రిలోనే వైద్య బృందం డాక్టర్ అరుణ, లక్ష్మి, స్వాతి, శిరీష, రాజేష్, భానులక్ష్మి లు విజయ కు సిజేరియన్ చేసి ప్రసవం చేయగా పండంటి మగబిడ్డ ను జన్మించాడు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అభినందించారు. పండంటి మగ బిడ్డ పుట్టడంతో ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలే కాదు శ్రీమంతులు కూడా గోదావరిఖని ప్రభుత్వ దవాఖానాలో వైద్య సేవలు పొందవచ్చని స్ఫూర్తిని చాటారు. దీంతో సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ ను పలువురు నెటిజెన్లు అభినందనలు తెలిపారు.