16-12-2024 11:42:23 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీఎం కప్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించి జిల్లా పేరును నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్-2024 క్రీడలను కలెక్టర్ సోమవారం జ్యోతి ప్రజలన గావించి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. గ్రామ, మండల స్థాయిలో సీఎం కప్ 2024 క్రీడలను విజయవంతంగా పూర్తి చేసుకొని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు.
జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 27 నుండి వచ్చే జనవరి 2వ తేదీ వరకు నిరహించే క్రీడలలో పాల్గొని, రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలవాలని సూచించారు. నేటి నుండి ఆరు రోజుల పాటు జిల్లా స్థాయిలో కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, బాడ్మింటన్ బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, చెస్, బాక్సింగ్, సిమ్మింగ్ లతో పాటు మరికొన్ని రకాల క్రీడ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశర్లు, అభివృద్ధి అధికారి పార్థసారథి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.