జడ్చర్ల,(విజయక్రాంతి): కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తూ అవగతం చేసుకుంటూ వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం జడ్చర్లలో డా.బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల, శ్లోక పాఠశాలలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలు డేటా ఎంట్రీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.
నిబంధనలను పక్కాగా పాటిస్తూ, అన్ని వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. త్వరితగతిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా, సాంకేతికపరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నమైతే, వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.