calender_icon.png 28 December, 2024 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక క్యాంపును సందర్శించిన కలెక్టర్

02-12-2024 03:09:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ఎన్జీవో, శిశు విహార్ సంరక్షణ కేంద్రాలలోని పిల్లలకు జనన, కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలను వారం రోజుల్లోగా అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ మధుర నగర్ శిశు విహార్ సంరక్షణ కేంద్రంలో ఎన్జీవో, శిశు విహార్ లో గల పిల్లలకు బర్త్, ఆదాయం, కుల, ఇతర ధ్రువీకరణ పత్రాల జారీకై ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును కలెక్టర్ సందర్శించారు.

ఎనిమిది నెలల బాలికకు బర్త్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాతూ... జిల్లాలోని అన్ని ఎన్జీవో సంస్థల, శిశు విహార్ సంరక్షణ కేంద్రంలోని పిల్లలందరికీ వారం రోజుల్లోగా ప్రత్యేక క్యాంపు ద్వారా వివిధ రకాలైన జనన, కుల, ఆదాయ, ఇతర ధ్రువపత్రాలను అందించాలని ఆదేశించారు. సంరక్షణ కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, వైద్యులు  పిల్లల ఆరోగ్య పరిరక్షణకై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా పిల్లల బాగోగులు చూడాలన్నారు. సంరక్షణ కేంద్రాలలోని పిల్లల యొక్క తల్లిదండ్రులు చనిపోతే వారి ఆస్తిపాస్తులు పిల్లలకు చెందేలా రెవెన్యూ శాఖకు వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, సికింద్రాబాద్ ఆర్డీవో సాయి రాం, డిసిపిఓ శ్రీనివాస్, తహసీల్దార్ నయీమ్ ఉద్దీన్ , బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ సుమలత, యూనిసెఫ్ స్టేట్ కోఆర్డినేటర్  డేవిడ్, సిడిపిఓ, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.