కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కారాగారాన్ని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పది స్మార్ట్ టీవీలను జైలు సూపరిటెండెంట్ కె.శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జైలులోని ఖైదీల బ్యారక్ లు తిరుగుతూ వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కిచెన్, క్యాంటీన్, ఖైదీలు స్వయం ఉపాధి పొందే ఫ్యాక్టరీ, టైలరింగ్ రూములను, టెలిఫోన్ రూమ్, లైబ్రరీ, హాస్పిటల్ బ్యారక్ పరిశీలించి జైలులో ఖైదీలకు అందిస్తున్న భోజనం వివరాలను తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ వెళ్లి సరుకుల నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ బ్యారక్ లో టీవీని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జైలు జీవితం గడుపుతున్న వారిలో మానసిక ఆందోళనను దూరం చేస్తూ, వారిలో సత్ప్రవర్తనను పెంపొందించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు, అండర్ ట్రయల్ ముద్దాయిలు, ఖైదీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, జైలు నిబంధలకు అనుగుణంగా అన్ని వసతి, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఖైదీల్లో మార్పు వచ్చేందుకు జైలు వాతావరణం దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలర్లు పి శ్రీనివాస్, రమేష్, డిప్యూటీ జైలర్లు ఎ. శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ తదితరులు ఉన్నారు.