మహబూబ్ నగర్, (విజయక్రాంతి): తన రచనల ద్వారా ప్రజలలో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని తీసుకురావడమే కాకుండా, స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన సామాన్య ప్రజల కోసం పనిచేసిన మహా వ్యక్తి కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవ కార్యక్రమంలో కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలవేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. కాలోజీ నారాయణరావు ఒక రచయితగానే కాకుండా, రాజకీయవేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు.
ఆయన రచించిన నా గొడవ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందని, సామాన్యుడే నా దేవుడు అనే నినాదం అయనదని పుట్టుక నీది, చావు నీది, బతకంతా దేశానిదన్న స్ఫూర్తితో జీవితమంతా తెలంగాణకు అంకితం చేశారని కొనియాడారు. అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు , డిఆర్ఓ రవికుమార్,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్,డిఆర్డిఓ నరసింహులు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.