calender_icon.png 27 September, 2024 | 8:49 PM

మహనీయుల చరిత్రను భావితరాలకు అందిద్దాం...

27-09-2024 05:08:55 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహనీయుల చరిత్రను కాపాడుతూ వారి ఆశయాలను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, పద్మశాలి, బి.సి., ఇతర సంఘాల నాయకులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. బాపూజీ ఈ ప్రాంత వాసి కావడం సంతోషంగా ఉందని, జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, బాపూజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మహనీయుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు అందించాలని అన్నారు. ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమురం భీం వంటి మహనీయులు ఆసిఫాబాద్ ప్రాంతవాసులు కావడం గర్వంగా ఉందని, ప్రజల కోసం సాగించిన పోరాటాలు సదాస్మరణీయమని అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారని, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. వాంకిడి మండల కేంద్రంలో బాపూజీ పేరిట స్మృతి వనం, విగ్రహా ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, పద్మశాలి సేవా సంఘం నాయకులు ఆంజనేయులు, మల్లయ్య ,కొంగ సత్యనారాయణ, గుండా శంకర్ రాజన్న, లింగయ్య ,శ్రీకాంత్ , బి. సి. సంఘం నాయకులు రూప్ నార్ రమేష్, పి. ఎ. సి. ఎస్. అధ్యక్షులు అలీబిన్ అహ్మద్, ఎం. ఆర్. పి. ఎస్. నాయకులు రేగుంట కేశవరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.