పాలనలో పారదర్శకంగా వ్యవహరించండి
విలీన గ్రామాల రికార్డులు సమర్పించండి
తెల్లాపూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ క్రాంతి ఆకస్మిక తనిఖీ
పటాన్ చెరు,(విజయక్రాంతి): చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆక్రమనలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కోరారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ రికార్డులను తనిఖీ చేశారు. మున్సిపాలిటీ ద్వారా గృహ నిర్మాణాలకు సంబంధించి మాన్యువల్ అనుమతులు మంజూరు చేయవద్దని ఆదేశించారు. పరిపాలనలో అధికారులంతా పారదర్శకతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు.
మున్సిపల్ కార్యాలయ కార్యకలాపాలు సజావుగా కొనసాగడానికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దానికి తోడు మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యనికి ప్రథమ ప్రాధాన్యతమిస్తూ తడి చెత్త, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహించి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపల్ టాక్స్ ను నిర్దిష్ట సమయంలో వసూలు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.
విలీన గ్రామాలైన ముత్తంగి పార్టీ కర్దనూరు పోచారం ఘనపూర్ గ్రామాల పూర్తి రికార్డులను మున్సిపల్ కార్యాలయంలో అప్పగించాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి కుటుంబం డిజిటల్ కార్డులు పొందడం ద్వారా ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలతో పాటు సర్వీసులను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మండల ప్రత్యేక అధికారి దేవుజా, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, కమిషనర్ సంగారెడ్డి మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.