30-04-2025 03:39:38 PM
నాణ్యతతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించుకోవాలి
ధర్మారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఆసుపత్రులను తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ధర్మారం (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Koya Sree Harsha) అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ధర్మారం మండలంలోని దొంగతుర్తి, ఖిలా వనపర్తి, శాయం పేట, నంది మేడారం గ్రామాలలో ప్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఖిలా వనపర్తి గ్రామంలో పల్లె దవాఖాన, నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం సత్వరమే మిల్లులోకి తరలించేందుకు అవసరమైన మేర వాహనాల సంఖ్య పెంచడం జరుగుతుందని, రైస్ మిల్లులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ హమాలీల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఖిలా వనపర్తి పల్లె దవాఖానా పరిధిలో గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ గా ఏ.ఎన్.ఎం.లు చెక్ అప్ నిర్వహించి అవసరమైన టీకాలు వేసుకునేలా చూడాలన్నారు. నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ పరిశీలించి, ప్రతి గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యేలా చూడాలని, ఎన్.సి.డి సర్వే పకడ్బందీగా నిర్వహించి బీపీ, మధుమేహం వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులు పంపిణీ చేయాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి మిగిలి ఉన్న పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం బంజెరూ పల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన 71 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో నాణ్యమైన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 400 ఫీట్లకు తక్కువ కాకుండా 600 ఫీట్ల లోపు ఇండ్ల నిర్మాణం లో 4 విడతల లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం విడుదల చేయడం జరుగుతుందని, పనులు ప్రారంభించనీ లబ్ధి దారులను వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పీడీ .హౌసింగ్ రాజేశ్వర్ , తహసిల్దార్ వకీల్ , వైద్యులు డాక్టర్ అనుదీప్, డాక్టర్ సుష్మీత , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.