పెద్దపల్లి: జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితా పకడ్బందీగా రూపోందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారంజిల్లా కలెక్టరేట్ లో గ్రామ పంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పనపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశం ఉందని, దీనికి అవసరమైన ముసాయిదా ఓటర్ జాబితాను గ్రామాల వారీగా రూపొందించి ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల ఓటర్ జాబితా ప్రకారం... గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ జాబితా సవరణకు చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాల నిండి అర్హులైన వారికి నూతన ఓటర్లను నమోదు చేయాలని, గ్రామాల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ముసాయిదా ఓటర్ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో వన మహోత్సవం కింద నిర్దేశించిన మొక్కల లక్ష్యం పూర్తి చేయాలని, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.