మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని మండలాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సిగ్నల్ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అందరికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మాత్రం అందుబాటులో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదన్నారు. దీనితో ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలో ఉన్న ఆధార్ కేంద్రాలు అన్ని మండలాల్లో లేకపోవడం, ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రాల్లో సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడం వలన జిల్లాలోని విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీస్ లో ఉన్న ఆధార్ కేంద్రానికి ప్రజలు ఒక రోజు ముందు వచ్చి అక్కడే ఉండటం, లేదా రాత్రి 3 నుంచి ఉదయం 10 గంటల వరకు ఆధార్ టోకెన్ కోసం వేచి చూడాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. రోజు 40 టోకెన్స్ ఇచ్చే సరికి టోకెన్స్ రాని వారు చాలామంది వెనుతిరిగి వెళ్తున్నారని, చంటి పిల్లల తల్లులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి, రోజుకు కనీసం 50కి పైగా ఆధార్ సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు.