16-04-2025 06:31:45 PM
అధికారులను పంపి చిన్నారుల బంధువులకు భరోసా..
పాపన్నపేట: అనాధ పిల్లలకు మేమున్నామంటూ జిల్లా కలెక్టర్ అభయమిచ్చారు. జిల్లా అధికారులను పంపి కుటుంబీకులకు పిల్లల భద్రత, వసతి పట్ల భరోసా కల్పించారు. జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నిరంతరం ఉంచేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం విజయక్రాంతి దినపత్రికలో "తనువు చాలించిన తండ్రి అనాధలను చేసిన తల్లి" అనే ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) తక్షణమే స్పందించారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ని చిన్నారుల స్వగ్రామమైన కుర్తివాడకు స్వయంగా పంపారు. వారి స్థితిగతులపై ఆరా తీశారు. వారి బంధువులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు.
పత్రికలో వచ్చిన కథనం ప్రకారం చిన్నారుల పరిస్థితిని బంధువులు గ్రామస్తులు అధికారులకు వివరించారు. ఈ విషయమై చిన్నారులను బాలసదనంలో ఉంచేందుకు కలెక్టర్ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్తులు, బంధువులకు సూచించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో చిన్నారుల పూరి గుడిసె వద్ద నూతన ఇంటి నిర్మాణాన్ని చేయించి ఇచ్చేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపినట్లు అధికారులు చెప్పారు. చిన్నారులు పరీక్షలు ముగిసి వేసవి సెలవులకు ఇంటికి రాగానే చిన్నారులతో చర్చించి కొద్దిరోజులు తమవద్ద ఉంచుకొని అధికారుల వద్దకు తీసుకువస్తామని బంధువులు గ్రామస్తులు అధికారులకు తెలిపారు.
ఇదే కథనంపై చిన్నారులకు సహకరించేందుకు పాపన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి స్పందించారు. చిన్నారులకు ఇందిరమ్మ ఇల్లు అధికారులు మంజూరు చేసినట్లయితే నిర్మాణ పనులను తాను బాధ్యత తీసుకొని నిర్మింపజేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కథనంపై మరింత మంది దాతలు స్పందించి చిన్నారులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లా కలెక్టర్ కు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు, నాయకులకు, దాతలకు, చిన్నారుల బంధువులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.