01-03-2025 07:47:52 PM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్,(విజయక్రాంతి): సదరం సర్టిఫికెట్ల(Sadarem Certificate) కోసం దరఖాస్తులు చేసుకుని, వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవలే కొత్తగా యూనిక్ డిజెబిలిటీ ఐ.డీ (యూడీఐడీ) పోర్టల్(Unique Disability ID Portal) ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి శనివారం సెర్ప్ సీ.ఈ.ఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు, డీఆర్డీఓలు, డిడబ్ల్యూఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన ఛాంబర్ నుండి వీ.సీలో పాల్గొన్నారు. వీ.సీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై, సదరం సర్టిఫికెట్ల కోసం ఇకనుండి యు.డీ.ఐ.డీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునేలా చూడాలన్నారు.
ఆన్లైన్ లో నేరుగా కానీ, మీ-సేవ కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికి సంక్షిప్త సందేశం (ఎస్.ఎం.ఎస్) ద్వారా సదరం క్యాంపునకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో అక్షర దోషాలు, ఇతర తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మేరకు మీ సేవ ఆపరేటర్లకు శిక్షణ అందించాలని సూచించారు. ఇప్పటివరకు ఐదు రకాల కేటగిరీల వారికే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్ లో 21 రకాల కేటగిరీలను చేర్చారని కలెక్టర్ వివరించారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
సదరం శిబిరాలలో వైకల్య నిర్ధారణ జరిగిన మీదట, సదరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపేణా పోస్టల్ శాఖ ద్వారా ఇంటి చిరునామాకు పంపిస్తారని అన్నారు. చేయూత పెన్షన్లతో పాటు ఇతర అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల లబ్ది కోసం సదరం స్మార్ట్ కార్డు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా సదరం సర్టిఫికెట్ ను ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా, వైకల్య నిర్ధారణ కోసం శిబిరాలకు వచ్చే దరఖాస్తుదారులకు తాగునీరు, టాయిలెట్స్, కూర్చునేందుకు కుర్చీలు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.