calender_icon.png 15 January, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తి...

10-09-2024 04:05:33 PM

వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్, (విజయ క్రాంతి): భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్థంతి సందర్భంగా మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరు 22న ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలు కు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించిందని, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగిందని వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉందన్నారు. 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టిందని తెలిపారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజలింగు, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, ప్రజలు పాల్గొన్నారు.