16-04-2025 05:35:50 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడి..
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): ఈ నెల 17వ తేదీ నుండి 28వ తేది వరకు జిల్లాలోని అన్ని మండలాలలో జరుగనున్న భూ భారతి అవగాహన సదస్సుల షెడ్యూల్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ప్రకటించారు. 17వ తేది గురువారం నుండి జిల్లాలోని 12 మండలాల్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్న లక్ష్యంతో అన్ని మండలాల్లో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తహసీల్దార్ లను ఆదేశించారు.
ఉదయం 10 గంటలకు అవగాహన సదస్సు ప్రారంభం అవుతుందని, అయితే పలిమెల, ఘోరి కొత్తపల్లి, టేకుమట్ల మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అవగాహన సదస్సు ప్రారంభం అవుతుందని, ఎండను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నీడ, మంచినీరు వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. చట్టంపై అవగాహన సదస్సుకు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ద్వారా కళాజాత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఆయా మండలాల్లో కళాజాత కార్యక్రమాలు జరిగే వేదికకు ఒక గంట ముందుగానే అనగా ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.