calender_icon.png 17 October, 2024 | 12:19 AM

ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

16-10-2024 09:16:56 PM

చిన్నశంకరం పేట,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలను, మండలంలో శానిటేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు గణితం, ఆంగ్లం సబ్జెక్ట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై కలెక్టర్ పలు సూచన చేస్తూ ఇప్పటినుండి 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుండి పదవ తరగతి సిలబస్ పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు  అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తయారీ విధానమును స్టోర్ రూమ్ లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెనూ ప్రకారం అందించాలని పేర్కోన్నారు. పాటశాల ఆవరణలోని బాలుర టాయిలెట్లను, పరిసరాలను స్వయంగా పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు. 

పాఠశాలలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకుని హాజరు పట్టిక మరియు సాధారణ సెలవు రిజిస్టర్ లను పరిశీలించినారు. ముందస్తు సమాచారం లేకుండా, సెలవు దరఖాస్తు ఇవ్వకుండా గైర్హాజరైన ఉపాధ్యాయుల పై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామ పరిసరాలను పరిశీలిస్తూ ఫ్రైడే డ్రై డే  ఖచ్చితంగా అమలు చేయాలని,వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.  సాయంకాలం మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా దోమలు పుట్టకుండా మరియు కుట్టకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని తద్వారా వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీ ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.