calender_icon.png 4 October, 2024 | 10:44 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

04-10-2024 07:51:44 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ,(విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సాఫీగా సాగేటట్టు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యం ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ, పౌర సరఫరాలు, డీఆర్డీవో ఐకేపీ, మార్కెటింగ్, తూనికలు- కొలతలు, రవాణా,  తదితర శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు  ప్రక్రియకు సంబంధించి ఏవైన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.

వాటికి సంబంధించిన వివరాలతో నివేదికను అందజేయాలన్నారు, టాస్క్ ఫోర్సు, ఫ్లయింగ్ స్క్వాడ్ కమిటీ ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి కమిటీ  చర్యలు చేపడుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. కింది స్థాయి వరకు ధాన్యం కొనుగోలు నిర్వహణ సంబంధించిన అంశాలు తప్పకుండా తెలియాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అదనంగా కావాల్సి వస్తే వాటి వివరాలను అందజేయాలన్నారు. పేమెంట్ ఆలస్యం కాకుండా అధికారులు డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్లను ఏర్పాటు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సన్న, దొడ్డు రకం దాన్యం  కొనుగోలు సందర్భంగా వాటిని వేరువేరుగా  ఉంచాలని. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్ తెలిపేలా బ్యానర్ ని ఏర్పాటు చేయాలన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతాన్ని కొలవాలని, ప్యాడి క్లీనర్ ఉండాలని, తాగునీరు, టెంటు తప్పనిసరిగా ఉండాలన్నారు.

33 రకాల ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు  రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఒక డిగ్రీ ఉత్తీర్ణణ కలిగిన వ్యక్తిని నియమించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో హార్వెస్టర్ యజమానులతో సమావేశాన్ని నిర్వహించాలని ఆర్టీవోలకు కలెక్టర్  సూచించారు. వ్యవసాయ, పౌర సరఫరాల, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ధాన్యం నింపిన సంచులలో సన్న రకానికి ఎర్ర ధారం, దొడ్డు రకానికి ఆకు పచ్చ ధారంతో కుట్టు వేయాలని అన్నారు. ధాన్యము కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, డిఆర్డీవో నాగ పద్మజ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉమారాణి, ఇతర శాఖల అధికారులు, తహసిల్దార్లు , పలు రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.