15-02-2025 11:21:47 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,(విజయక్రాంతి): ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ దన్గన్‌వాడి ఉన్నత పాఠశాల, గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయబోయే గదులను, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో తన ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మార్వోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, తహసిల్దార్లు నరేందర్, అనుపమ, ఎంపీడీవో, రామడు, ఆర్‌ఐలు శ్రీనివాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.