కరీంనగర్,(విజయక్రాంతి): కాళోజీ నారాయణరావు రచనలు ప్రస్తుత తరానికి, భవిష్యత్తు తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజి జయంతి వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. రచనల ద్వారా ప్రజా చైతన్యంలో కీలకపాత్ర పోషించిన కాళోజీ చిరస్మరణీయులని అన్నారు. కాళోజి రచనలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయని, అన్యాయంపై పోరాడేలా చేస్తాయని తెలిపారు. అక్షరం ద్వారా లక్షల మందిని కదిలింప చేయవచ్చనే ఆయన ఆలోచనను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయ్, ట్రైని కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.