calender_icon.png 23 September, 2024 | 4:55 AM

ఉద్యమంలా వనమహోత్సవాన్ని చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి

25-07-2024 04:31:04 PM

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జెడ్పీ క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యము.. నాటిన మొక్కల సంఖ్య.. ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. తదితరు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... డిఆర్డిఓ, అటవీ, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వన మహోత్సవంలో విధించిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఇది గమనించి అధికారులు ముందుకెళ్లాలని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. రహదారుల వెంట రైతు వేదికల్లో, అంగన్వాడీ సెంటర్లు, గ్రామాల్లో మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు.  దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.