calender_icon.png 28 September, 2024 | 8:47 AM

భావితరాలను తీర్చిదిడ్డం ఉపాధ్యాయులకే సాధ్యం: కలెక్టర్ కుమార్ దీపక్

05-09-2024 09:27:31 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యార్థి వ్యవస్థ నుంచి సన్మార్గంలో నడిపిస్తూ మంచి అలవాట్లు చేస్తూ భావితరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని, దేశ భవిష్యత్తు తరగతి గదులలో ఉపాధ్యాయుల నేతృత్వంలో నిర్మించబడుతుందని, గురువుల మార్గనిర్దేశకత్వంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. పిల్లలకు విద్యార్థి వ్యవస్థలో గురువులు నేర్పిన పాఠాలు చాలా బలంగా ఉంటాయని, ప్రభుత్వ విద్యా వ్యవస్థలను నాణ్యతా ప్రమాణాలతో బలోపేతం చేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తయారు చేసి విద్యార్థులకు సకల సౌకర్యాల నడుమ మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత ఫలితాలు సాధించేలా వారితో మమేకమై ఫలితాలలో లక్ష్యసాధన దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ఈ రోజున అనేక మంది ఉన్నత స్థాయిలలో నిలువడంలో తరగతి గదులలో ఉపాధ్యాయులు నేర్పించిన పాఠాలే మూలమని, ఉపాధ్యాయులు, పిల్లలు రోజులో ఎక్కువ సమయంలో పాఠశాలలోనే గడుపుతారని అన్నారు. దేశంలోని ఎంతో మంది మేధావులకు ఉపాధ్యాయులే ఆదర్శమని, పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థులపై ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు.

ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేయాలని, సామాజిక బాధ్యతతో వ్యవహరించి పిల్లలకు సమాజంలో అవసరాలు ఉన్న వ్యక్తులకు సహాయం అందించడం అలవాటు చేయాలని, మానవత్వ విలువలు తెలియజేయాలని తెలిపారు. అనంతరం క్రమశిక్షణ, సమయపాలన, డ్రాప్ అవుట్ల తగ్గింపు, నైతికత, విద్యార్థుల సంఖ్య పెంపుదల, వినూత్న బోధనా పద్ధతులు అవలంభించడం లాంటి అంశాలలో ఉత్తమ సేవలు అందించిన 43 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.