calender_icon.png 22 March, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి

21-03-2025 08:44:18 PM

మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథ సిబ్బందితో సమీక్ష చేసిన కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా నిరంతరంగా శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. శుక్రవారం మిషన్ భగీరథ ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లతో కలిసి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోగల మిషన్ భగీరథ పంప్ హౌస్(Mission Bhagiratha Pump House) వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  వేసవిలో నీటి ఎద్దడి సమస్య ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి కాలంలో నీటి అవసరాలకు అనుగుణంగా తగినన్ని వాటర్ ట్యాంకులను సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా, ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించి పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాను నిరంతరంగా  కొనసాగించాలని, జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందించడమే కాకుండా, నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అమృత జల్ 2.0 పథకం కింద చేపట్టిన  పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 

ఈ క్రమంలో డ్రైవర్స్ కాలనీ లోగల  మిషన్ భగీరథ పంప్ హౌస్  పరిశీలించారు. పట్టణ ప్రజలకు ప్రతి రోజు తాగునీరు సరఫరా చేసే విధానాన్ని , రాజంపేట ఫిల్టర్ బెడ్‌ను సందర్శించి వాటర్ క్లీనింగ్ ప్రక్రియ, నీటి నిల్వ వివరాలను  అడిగితెలుసుకున్నారు . మిక్సింగ్, క్లోరినేషన్ ప్లాంట్ల నిర్వహణపై సమగ్ర అవగాహన  కలిగివుండాలని   అన్నారు .  సంగారెడ్డి పట్టణంలో  సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేకంగా, వేసవి కాలంలో పట్టణ పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నీటి సరఫరాతో పాటు పట్టణంలోని పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, ఈఈ విజయలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ ఎస్సీవీకే చవాన్, మునిసిపల్ డిప్యూటీ ఇంజనీరింగ్ అధికారి ఇంతియాజ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ అధికారి కృష్ణ మోహన్, ఏఈ రఘువీర్, అద్దికారి అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.