calender_icon.png 22 March, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

21-03-2025 07:48:23 PM

వచ్చే నెల 2 వరకు 10వ తరగతి పరీక్షలు

ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి,(విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని  ఆకస్మిక తనిఖీ చేశారు. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలు, 22 వేల 423 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. తనిఖీ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో నిర్వహణ విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాల అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాలలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు  ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల, కరుణా హై స్కూల్, సాహితీ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్  సందర్శించి, అక్కడి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా రాయడానికి వచ్చిన విద్యార్ధిని, విద్యార్థులకు ఉండవలసిన కనీస సదుపాయాలు, అత్యవసర మెడికల్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 10వ తరగతి పరీక్షల నిర్వాహణ గైడ్ లైన్స్ పాటిస్తూ, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు  వివరించారు. పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్నటు వంటి అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసివేయాలని ముందుగానే నోటీసులు జారీ చేసి, మూసివేయించడం జరిగింది అన్నారు. విద్యార్థులకు, ఇన్విజిలేటర్స్ , ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్స్ ఎవ్వరికి కూడా పరీక్ష కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడానికి అనుమతించబడవు అన్నారు. పరీక్షా కేంద్రం  వద్ద ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లైతే వెంటనే డయల్ 100 లేదా  సమీప పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.