మంథని గోదావరి నది పరిశీలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మంథని, (విజయక్రాంతి): గోదావరి, మానేరు నదుల ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని గోదావరి నది ప్రాంతాన్ని ఆయన అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని, సాయంత్రం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. బొక్కలో వాగు ఉదృతంగా ప్రవహిస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మంథని ఆర్డీఓ హనుమా నాయక్, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.