18-03-2025 03:49:25 PM
పెద్దపల్లి జిల్లాలో 20 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు
రామగుండంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రామగుండం,(విజయక్రాంతి): సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం మండలం గాంధీ పార్క్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం ఎంపిపిఎస్ స్కూల్ , ఇంగ్లీష్ మీడియం లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎ.ఐ విద్యా బోధన కోసం ఆయా పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(ఏఐ)ను వినియోగిస్తూ విద్యార్థుల ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధన ప్రారంభించాలని అన్నారు. విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంచేందుకు ఏఐ సహాయంతో నూతన బోధన పద్ధతులను ప్రవేశపెట్టిందని, మన పెద్దపల్లి జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ విద్యా బోధనను ప్రారంభిస్తున్నామన్నారు. ఏఐ కోర్సు ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఉంటుందని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా బోధన జరిగేలా ఏఐ కోర్సులు రూపొందించడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచేలా ఎఐను వినియోగించడం జరుగుతుందని, పిల్లలు తెలుగు, ఆంగ్లం బాగా చదివి, రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించేలా చూడడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రతి పాఠశాలలో ఇంటర్నెట్ సదుపాయంతో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తారని, వెనుకబడిన విద్యార్థులను బ్యాచ్ గా ఎంపిక చేసి, తెలుగు ఆంగ్లం గణితంలో ఏఐ ద్వారా తయారు చేసిన పాఠాల బోధిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో ఏఐ పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, ఏఏంఓ డా. పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.