01-03-2025 05:01:17 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పంచాయతీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ... మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని, నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులు ఆయా శాఖల సిబ్బంది కి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూట్ నీకోసం ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు.
నీటిపారుదల శాఖ పరిధిలో తనిఖీ ల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి వనరులు బఫర్ జోన్ , ఎఫ్ టి ఏ లలో ఉండవద్దన్నారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ సమయంలో నిబంధనలు తప్పనిసరి పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలన చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముందుగా పెండింగ్ దరఖాస్తుల లొకేషన్ ను గుర్తించాలన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు వారాల్లో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆర్డివోలు మధు, దామోదర్ రావు ను ఆదేశించారు.