22-02-2025 05:27:31 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సిబ్బందికి సూచించారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల ముందు రోజే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడ తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ సామాగ్రి అన్ని పరిశీలించుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుందని, ఆరోజు అందరూ విధిగా సమయపాలన పాటించి మీకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని తీసుకొని కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లవలసిందిగా ఆదేశించారు. ఫిబ్రవరి 27 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేయడం, క్రాస్ చెక్ చేసుకోవటం, నాలుగు గంటలకు ఆఖరి ఓటర్ ఓటు వేసిన తర్వాత బాక్సులు అన్నీ సీల్ చేసి నేరుగా నల్గొండ కలెక్టరేట్ కు అందజేయాలని తెలిపారు. పోలింగ్ అధికారులు అందరూ బాధ్యతగా ఎన్నికల విధులను ప్రశాంతమైన వాతావరణంలో రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలను నిర్వహించాలని అన్నారు.