కలెక్టర్ జితేష్ వి పాటేల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకు విస్తరించడానికి గిరిజన మహిళలే కాకుండా వివిధ గ్రూప్ మహిళల సహకారం తప్పనిసరిగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) అన్నారు. శనివారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటిసిలో డిఆర్డిఏ, ఎంఎస్ఎంఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు గృహో పకరణాలు, ఔషధ గుణానికి సంబంధించిన పదార్థాలు ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఈ నెలలో జరిగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గిరిజన సంస్కృతికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు పర్యాటకులకు తెలియజేయడానికి ప్రత్యేకంగా రివర్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చే పర్యాటకులకు మన సంస్కృతికి సంబంధించిన విషయాలు తెలియజేసే విధంగా ప్రత్యేకమైన గిరిజన వంటకాలు గిరిజనుల వివిధ గృహాపకరణాలు వారు కొనుగోలు చేసే విధంగా ప్రత్యేక డిజైన్ గా ప్యాకింగ్ చేసి వారికి అందించే విధంగా మహిళలు ప్యాకింగ్ డిజైనింగ్ శిక్షణ తీసుకుంటున్నందున దీనిని తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని అన్నారు.
సహజంగా మన ప్రాంతాలలో దొరికే కరక్కాయను పౌడర్ చేసి ఔషధ గుణం కలిగిన టీ తయారు చేయవచ్చని, జొన్నలతో మరమరాలు, జొన్న పాప్కార్న్, మిల్లెట్ స్నాక్స్, గిరిజనులకు సంబంధించిన పాతకాలపు ఆట వస్తువులు పర్యాటకులు బాగా ఆకర్షించి కొనుగోలు చేస్తారని అన్నారు. మా తరఫున ప్యాకింగ్ కవర్స్, స్టిక్కర్స్ ఉచితంగా మహిళలకు అందిస్తామని రివర్ ఫెస్టివల్ లో స్టాల్స్ పెట్టుకున్న మహిళలు ఇక్కడ నేర్చుకున్న డిజైనింగ్ ప్యాకింగ్ తప్పనిసరిగా మీరు అమ్మకాలు జరిపే వస్తువులకు ప్యాకింగ్ చేసుకొని అమ్మాలని అన్నారు.
ప్రస్తుతం రివర్ ఫెస్టివల్లే కాకుండా ప్రతిరోజు మీరు తయారు చేసే వస్తువులు అమ్మకాలు జరుపుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తామని అందుకు మహిళలందరూ తప్పనిసరిగా కల్తీ లేని ఆహార పదార్థాలతో తినుబండారాలు తయారు చేసి అమ్ముకొని జీవనోపాధి పొందాలని అన్నారు. అనంతరం హైదరాబాదు నుండి వచ్చిన ప్యాకింగ్ డిజైనర్స్ మహిళలకు కరక్కాయల పొడితో టీ తయారు చేయడం, జొన్న రవ్వ, రాగి రవ్వ మరమరాలతో బొంగు పేలాలు తయారుచేసి ప్యాకింగ్ మరియు డిజైనింగ్ వాటి మీద గ్రూపు యొక్క పేర్లు ఏ విధంగా పెట్టాలో మహిళలకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యాచందన, డి ఎం జి సి సమ్మయ్య, జేడీఎం హరికృష్ణ, ప్యాకింగ్ డిజైనర్స్ కీర్తన, కల్పన, అనురాధ, భవిత సెల్ సిబ్బంది మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.