కిన్నెరసానిలో పుట్టి ట్రయల్ రన్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కిన్నెరసాని ప్రాజెక్ట్ ను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కిన్నెరసాని ప్రాజెక్ట్ కుడి కాలువలో పుట్టి ద్వారా పర్యాటకులను ఆకర్షించే విధంగా పుట్టిలో ప్రయాణించి కలెక్టర్ ట్రైల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుందని అన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు వీక్షిస్తూ పర్యాటకులు ఈ పుట్టి ప్రయాణం చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం మరియు కిన్నెరసాని అందాలను పర్యాటకులకు మరింత చేరువ చేస్తుందని ఆయన అన్నారు.
అదేవిధంగా మత్స్యకారులు వీటిని నడిపించడం ద్వారా వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. కిన్నెరసాని నీ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పర్యటనకు పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పుట్టి లో ప్రయాణించిన కలెక్టర్ అధికారులకు పర్యాటకులకు భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టవలసిన చర్యలపై తగు సూచనలు చేశారు. అతి త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు.ప్రాజెక్టు పార్కు నందు చేయవలసిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలోసంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.