లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
అధికారులకు కలెక్టర్ క్రాంతి వల్లూరు దిశానిర్దేశం
సంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకొని ప్రతి యేటా ఎకరానికి రూ .12,000 చొప్పున నేరుగా వారి ఖాతాలలో నగదు జమ చేయనుందని తెలిపారు. భూభారతి(ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు. క్షేత్రస్థాయి సందర్శన జరిపి భూమి వ్యవసాయానికి యోగ్యమైనదా? కాదా? అన్నది నిర్ధారించాలని అన్నారు. మండల స్థాయిలో తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, అలాగే గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రెవెన్యూ అధికారులతో కమిటీలను నియమించుకుని విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు.
ఈనెల 20వ తేదీ లోపు క్షేత్రస్థాయి సందర్శన ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో వివరాలను వెల్లడిస్తూ, గ్రామ సభ ఆమోదం పొందిన మీదట సంబంధిత పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలన్నారు. సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సాలీనా 12 వేల రూపాయలు అందించేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించాలన్నారు. 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన వ్యవసాయ కూలీ కుటుంబాలు ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎంపీడీవోలు, ఏపీవోలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులు జారీ చేసే విషయంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి తలసరి ఆదాయం, భూమి కలిగి ఉన్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను అందించడమే కాకుండా, పాత కార్డులలో మార్పులు చేర్పులను సైతం చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఎక్కడ కూడా డూప్లికేట్, డబుల్ రేషన్ కార్డులు జారీ కాకుండా పకడ్బందీ పరిశీలన చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు సర్వే వేగవంతం చేయాలన్నారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న టు బీహెచ్ కే పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి పూర్తి చేయించాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో లబ్ధిదారు వివరాలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రదర్శించాలన్నారు.నిజమైన లబ్ధిదారులు ఎంపికలు పారదర్శకత పాటించాలన్నారు.గ్రామ సభలలో ఇందిరమ్మ కమిటీల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. విమర్శలకు ఆస్కారం లేకుండా అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చొరవ చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను, గ్రామ సభలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సందర్భంగా సేకరించిన వివరాలను, గ్రామ సభలో చేసిన తీర్మానాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. గ్రామసభల నిర్వహణకు కనీసం రెండు రోజుల ముందే సంబంధిత గ్రామాలు, వార్డుల ప్రజలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాలని అన్నారు. ఎలాంటి ఒడిదుడుకులకు తావు లేకుండా గ్రామసభలు సాఫీగా జరిగేలా. చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పిడి డిఆర్డిఏ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, పిడి హౌసింగ్ ఆర్డీవోలు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.