22-03-2025 02:24:20 AM
రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, మార్చి 21 (విజయ క్రాంతి): పదవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.
విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం ల నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా, పక్కాగా పరీక్షలు జరిపించాలని అన్నారు. కాగా, జిల్లాలో 22,774 మంది విద్యార్థిని, విద్యార్థులకు గాను తొలి రోజున 22,715 మంది పరీక్షకు హాజరయ్యారని, 59 మంది గైర్హాజరు అయ్యారని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కవిత ఉన్నారు.