30-04-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించి రైతులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసారు. జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు రైతులకు మజ్జిగ పంపిణీ చేసేందుకు ఆదర్శ రైతు వెంకటేష్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవికాలంలో రైతులకు వడదెబ్బ కొట్టకుండా మజ్జిగ ఉపయోగ పడుతుందన్నారు. తోటి రైతులు రైతు వెంకటేష్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా ఆదర్శంగా నిలిచిన రైతు వెంకటేష్ ను అభినందిస్తూ వెంకటేష్‌తో పాటు అతని తండ్రి అంజయ్య ని కలిపి కలెక్టర్ సన్మానించారు.
ఎండాకాలంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే తోటి రైతుల సహకారం ఎంతో అవసరం అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు ధాన్యం దగ్గరే ఉండి ధాన్యాన్ని చూసుకుంటారని రైతులు బయటికి వెళ్లే పరిస్థితి ఉండదని, అందుకోసం వేడిని తట్టుకునేలా మజ్జిగ ద్రావణం అవసరమన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నీడ, చల్లని మంచినీరు, ఓ.ఆర్.ఎస్.ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి రైతుల కోసం ప్రత్యేకంగా మజ్జిగ అందించి వారి దాతృత్వాన్ని చాటుకోవాలన్నారు.