బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పాల్గొని వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న మౌలిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దశలవారీగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని కలెక్టర్ దీపక్ కుమార్ సమావేశంలో తెలిపారు. ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి జిల్లా అధికార యంత్రాంగానికి తెలియపరచాలని కలెక్టర్ కోరారు. వర్షాకాలం దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పట్టణ కౌన్సిలర్లు,మునిసిపల్ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తో పాటు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.