పాఠశాలలో సిబ్బందిపై ఆగ్రహం
మేడ్చల్, జనవరి 28 (విజయక్రాంతి) : కలెక్టర్ గౌతమ్ మంగళవారం మేడ్చల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. రెండు గ్రామాల్లో బస్తీ దవఖాన, పశువుల ఆసుపత్రి, ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. నూతనకల్ గ్రామంలోని బస్తీ దవఖానాలో ఓపి పెంచాలని సూచించారు.
రిజిస్టర్లను పరిశీలించారు. అంతకుముందు శ్రీరంగావరం గ్రామంలో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, వంటగది, డైనింగ్ హాలును, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు స్నాక్స్ అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. వారికి అందిస్తున్న ఆహారం గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెటర్నరీ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను వివరాలు అడిగారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో అన్ని శాఖల అధికారులు అలర్ట్ అయ్యారు.
కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, వైద్యాధికారి రఘునాథ స్వామి, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, తహసిల్దార్ శైలజ, ఎంపీడీవో వసంత లక్ష్మి ఉన్నారు.