28-02-2025 01:08:00 AM
విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ
ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) : విధులకు గైర్హాజరైన వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం ఇంద్రవెల్లి మండలం లోని ప్రాధమిక అరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసి రిజిస్టర్ లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా, లేరా పరిశీలించగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ తో పాటు సి.హెచ్.ఓ సందీప్, పి.హెచ్.ఎన్ జ్యోతి, సూపర్వైజర్ సురేష్,
సిబ్బంది పూజ లు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అవడం తో వారికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదనపు డీఎంఎచ్ ఓ మనోహర్ తో ఫోన్ లో మాట్లాడుతూ విధులకు గైర్హాజరైన వారి పై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు