మరొకరు కూడా సస్పెండ్
‘బ్రో’ వల్ల ప్రభుత్వ పరువు దిగజారుతోందన్న సర్కారు
తిరువనంతపురం, నవంబర్ 12: కలెక్టర్ బ్రోగా పిలవబడుతున్న కేరళ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంత్‌ను సర్కారు సస్పెండ్ చేసింది. ఆయనకు ఉన్న సోషల్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా సరే దిమ్మ తిరగాల్సిందే. సదరు కలెక్టర్‌కు ఎఫ్‌బీలో 3 లక్షలు, ఇన్‌స్టాలో 50వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా కలెక్టర్ బ్రో అలియాస్ ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్‌తో పాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న గోపాల్ కృష్ణన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదే కారణం..
ప్రశాంత్ కోజికడ్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో సోషల్ మీడియా వల్ల ఎంతో ఫేమస్ అయ్యారు. కానీ సీనియర్ ఐఏస్ కమ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయిన జయతిలక్‌ను సోషల్ మీడియాలో విమర్శించారు. ఇద్దరు సీనియర్ బ్యూరోక్రాట్లు సోషల్ మీడియాలో రచ్చకెక్కడంతో ప్రవీణ్‌ను విధుల నుంచి తప్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కేరళ చీఫ్ సెక్రటరీ శారద మురళీధరన్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
అతడలా ఇతడిలా..
కలెక్టర్ బ్రో తీరు అలా ఉంటే.. సస్పెండ్ అయిన మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలకృష్ణన్‌ది మరో తీరు. సదరు కలెక్టర్ సారు ‘మల్లు హిందూ ఆఫీసర్స్’ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేశాడు. మొదట తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తనకు తెలియకుండానే ఎవరో ఈ పని చేశారని చెప్పినా.. పోలీసుల దర్యాప్తులో హ్యాం కింగ్ ఉత్త ముచ్చటే అని తేలింది. సదరు ఐఏఎస్ కావాలనే అలా చేశాడని రుజువైంది. దీంతో ప్రభుత్వం అతడిని కూడా సస్పెండ్ చేసేసింది.