27-02-2025 10:37:27 PM
ఆస్పత్రి, వసతి గృహం నిర్మాణానికి రూ.52కోట్లు మంజూరు
ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్,(విజయక్రాంతి): యునానీ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం నిజామియా తిబ్బి కళాశాల, జనరల్ ఆస్పత్రిని ఛార్మినార్ ఎమ్మెల్యే మీర్ జులీఫకర్ అలీతో కలిసి సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని 5పురాతన భవనాలను తొలగించే ప్రక్రియపై కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అన్ని సదుపాయాలతో వసతి గృహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.52కోట్లు మంజూరు చేసిందన్నారు.
వాటిలో హెరిటేజ్ భవనాల పునర్నిర్మానానికి రూ.10కోట్లు, నూతన ఆస్పత్రి, హాస్టల్ భవన నిర్మాణానికి రూ.42కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నిబంధనల మేరకు పాత భవనాలను తొలగించి, భూవిస్తీర్ణం వివరాలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇక్కడి వసతి గృహాన్ని కూడా తొలగించనున్నందున విద్యారుథలను చార్మినార్ పరిసరాల్లో తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఓపీ బ్లాక్, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
కాలేజీ లైబ్రరీని సందర్శించి పురాతనమైన ఉర్ధూ, పార్శీ భాషలో గల వైద్య పుస్తకాలను పరిశీలించి వైద్య విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శైజాదీసుల్తానా, ఆస్పత్రి సూపరిండెంట్ వసంతరావు, ప్రెసిడెంట్ యుఎంవోఏ డా.హైదర్‌యమని, కార్పొరేటర్ సోయబ్‌ఖాద్రీ, ఎమ్మార్వో చంద్రశేఖర్, అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.