calender_icon.png 5 November, 2024 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

150 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

03-11-2024 12:08:40 AM

  1. ధాన్యం కొనుగోళ్లలో దేశానికే తలమానికంగా నిలవాలి
  2. అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, అధికారులు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొచ్చేలా ప్రవర్తించొద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ధాన్యం సేకరణలో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచేలా చూడాలని సూచించారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుందని, అందుకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే సర్కార్ రూ.20 వేల కోట్లు కేటాయించిందని, అవసరం మేరకు అదనపు నిధులు విడుదల చేస్తామన్నారు.

ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని, ప్రభు త్వం, రైస్‌మిల్లర్లు పరస్పర తోడ్పాటుతో కొనుగోళ్లను పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికే చేరగానే మిల్లర్లకు జీవో రిలీజ్ చేస్తామని, మిల్లర్ల డిమాండ్ మేరకు మిల్లింగ్ చార్జీలు పెంచినట్లు పేర్కొన్నారు. సన్నాలకు రూ.10 నుంచి రూ.50 వరకు, దొడ్డు రకాలకు రూ.10 నుంచి రూ.40 వరకు పెంచినట్లు వెల్లడించారు.

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామని, అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థా యిలో పర్యవేక్షించాలని చెప్పారు. ధాన్యం సేకరణకు ఇప్పటికే 4,598 కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లు తెలిపారు.

కొనుగోళ్లు పూర్తయ్యేంతవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డీఎస్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా అలా తదితరులు పాల్గొన్నారు.