calender_icon.png 28 February, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ పార్క్ లో డబ్బులు వసూలు చేయడం హేయమైన చర్య

28-02-2025 05:27:24 PM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు...

కూకట్ పల్లి (విజయక్రాంతి): ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఆహ్లాధం కోసం జీహెచ్ఎంసీ పార్క్ వచ్చే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం పట్ల కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ పరిధిలోని పార్కులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... మలేషియన్ టౌన్షిప్ వద్ద ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కులో జీహెచ్ఎంసీ వారు ప్రజల నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పార్కులు, ఆట స్థలాలను అభివృద్ధి చేయాల్సింది పోయి అక్కడికి వాకింగ్ కు వచ్చే ప్రజలనుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారని అధికారులపై మండిపడ్డారు. అదేవిధంగా ఐదవ ఫేజ్ లోనే ట్రయాంగిల్ పార్కు, నాలుగో ఫేజ్ బస్టాపు వద్ద థీమ్ పార్కును, బస్తీ దావకాన ముందు ఉన్న పెద్ద పార్కులో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు.

ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. నేడు వాకర్స్ పార్క్ లోని వాకర్స్ వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం తనను ఎంతగానో బాధ కలిగించిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులు, ఇండోర్ షటిల్ కోర్టులను కేటీఆర్ సహకారంతో అభివృద్ధి చేసుకున్నమని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేయకుండా ప్రజలను ఆందోళన గురిచేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, రాజేష్ రాయ్, సాయి శ్రీనివాస్ అధికారులు ఈఈ శ్రీనివాస్, డిఈ శంకర్, వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, యుబిడి డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభం, మేనేజర్ విజయ రాణి, సమత తదితరులు ఉన్నారు.