11-04-2025 01:33:33 AM
సీఎం రేవంత్‌కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): -ప్రభుత్వ కాలేజీల బీసీ హాస్టళ్లకు సొంత భవనాల కోసం స్థలాలు సేకరించాలని కోరుతూ రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య గురువారం సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. స్థలాలు కేటాయిస్తే సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం చేసిన ఉద్యమాలతో రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 325 బీసీ కాలేజీ హాస్టళ్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఒక్క హాస్టల్‌కు సొంత భవనం లేదన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు ప్రభుత్వం ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు.
దీంతో చాలీ చాలని వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతేడాది బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేయగా, హాస్టళ్లకు స్థలాలు ఉంటే సొంత భవనాలకు నిధులు ఇస్తామని చెప్పినట్టు ఆర్ కృష్ణయ్య లేఖలో వెల్లడించారు.