calender_icon.png 23 October, 2024 | 12:50 AM

కుప్పకూలిన ‘సుంకిశాల’ రిటెయినింగ్ వాల్

09-08-2024 12:45:29 AM

  1. ఈ నెల 2న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
  2. సిబ్బంది లేకపోవడంతో తప్పిన ప్రాణసష్టం
  3. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా

నల్లగొండ, ఆగస్టు 8 (విజయక్రాంతి): వరద తాకిడికి పెద్దవూర మండలం సుంకిశాల తండా వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పథకం రెటెయినింగ్ వాల్ (కాంక్రీట్ గోడ) ఆగస్టు ౨న కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిం ది. అప్పటికే సొరంగంలో రాత్రి విధులు నిర్వహించిన వారు బయటకు వెళ్లిపోవడం తో పెనుప్రమాదం తప్పింది. సాధారణంగా అక్కడ వందలాది మంది కార్మికులు పనిచేస్తారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీర్చేందుకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాల తరలింపునకు పథకం రూపుదిద్దుకుంటున్నది. పూర్తి కావొస్తున్న సమయంలో గోడ కూలడం చర్చనీయాంశమైంది. దీని పరిధిలోని సొరంగం నుంచి పంపుహౌస్‌లోకి జలాలు చేరకుండా రక్షణగా నిర్మించిన గోడ కూలడంతో పనులకు విఘాతం కలిగే అవకాశం ఉంది. గోడ కూలడంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

సొరంగాన్ని తెరవడంతోనే ప్రమాదం..

గత ప్రభుత్వ హయాంలో రూ.1,450 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ అధికారులు పనులను ప్రారంభించారు. సాగర్ నీటిమట్టాన్ని ఆధారం చేసుకుని ఒక్కోస్థాయిలో మూడు సొరంగాలు నిర్మించారు. ఈ సొరంగాల ద్వారా వచ్చే జలాలు పంప్ హౌజ్‌లోకి వచ్చేటప్పుడు ఆ ప్రదేశం కోతకు గురికాకుండా ఉండేందుకు భారీ రిటైయినింగ్ వాల్ నిర్మించారు. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద చేరడంతో మధ్యలో ఉన్న అధికారులు సొరంగం రిటైనింగ్ వాల్ వెనుక గేటు ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తిస్థాయిలో తెరిచారు.

దీంతో జలాలు అత్యంత ఫోర్స్‌తో సొరంగం గుండా దూసుకొచ్చి గేటును తాకాయి. ఆ ఒత్తిడికి గేటు తునాతునకలై రక్షణ గోడ కూప్పకూలింది. సాగర్‌లో నీటిమట్టం తగ్గి సొరంగంలో జలాలు లేకుంటే తప్ప.. మళ్లీ గోడ నిర్మించే అవకాశం లేదు. ఇప్పటికే సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు పైపులైన్ల నిర్మాణం పూర్తి కాగా.. ఇక అక్టోబర్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని భావిస్తున్న సమయంలో ప్రమాదం జరగడం అధికారులను నిరాశకు గురి చేసింది.

30 ఏండ్ల కల నెరవేరే సమయంలో..

నాగార్జున సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ దిగువన (462 అడుగులు) ఉన్నా నీటిని తరలించేందుకు వీలుగా నీటిపారుదలశాఖ అధికారులు సుంకిశాల పథకానికి రూపకల్పన చేశారు. 1980లో ఉమ్మడి రాష్ట్రంలో పథకానికి అనేక కారణాలతో కార్యరూపం దాల్చలేదు. తర్వాత చాలా కా లం పథకం వెనుకబడింంది. గత ప్రభుత్వం 1,450 కోట్ల అంచనాతో పథకాన్ని మొదలు పెట్టగా.. ప్రస్తుత వ్యయం 2,215 కోట్లకు పెరిగింది.  పూర్తి కావొస్తున్న సమయంలో పంప్‌హౌస్ రిటెయినింగ్ వాల్ కూలడంతో మళ్లీ పథకం మొదటికొచ్చినట్లయింది. 

సుంకిశాల అనవసర పథకం: గుత్తా 

సుంకిశాల ఓ దండగ పథకం అని, గతంలోనే తాను వ్యతిరేకించానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుంకిశాల పథకంకు చేసిన ఖర్చుతో ఎస్సెల్బీసీ పూర్తి చేసి ఉంటే జిల్లా రైతులకు చాలా మేలు జరిగేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ కృష్ణా బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టులపై చూపలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.