13-02-2025 12:52:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): సచివాలయంలోని దక్షిణ భాగంలో ని ఐదో ఫ్లోర్ రెయిలింగ్ కూలిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ప్రమా దంలో రెయిలింగ్ పట్టి ఊడి కింద పార్కింగ్‌లో ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం ద్వంసమైనట్లు తెలుస్తోంది. రూ.1200 కోట్లతో నిర్మించిన సచివాలయం నాసిరకం అంటూ గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.
సచివాలయం ప్రారంభం రోజే భవనం నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్కడక్కడ వాటర్ లీకేజీ ఆందోళన కలిగిస్తుండగా.. పలుచోట్ల పెచ్చులు ఊడి మరింత ప్రమాదకంగా మారింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే సచివాలయం నిర్మాణంపై అనేక ఆరోపణలు చేశారు. నిర్మాణానికి సంబంధించి భారీగా ఖర్చు చేయడంపై అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు.
సచివాలయం నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా గతంలో ఆరోపణలు చేశారు. తన ఛాంబర్‌తో పాటు టాయ్‌లెట్స్‌లోనూ శబ్దాలు వస్తున్నాయని స్వయంగా అధికారులకు తెలిపారు. సచివాలయం సౌత్, ఈస్ట్ ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్లే చోట ప్రస్తుతం ప్రమాదం జరిగింది. అక్కడే మంత్రులు, అధికారులు వాహనాలు పార్క్ చేసిన ఉంటాయి.
ఇటీవల 6వ అంతస్తులో వాస్తు మార్పులు చేసిన క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే మరమ్మతులు, మార్పులు చేసినట్లు సమాచారం. దీంతో గోడలు మరింత బలహీనంగా మారాయని అంటున్నారు. ఫలితంగా పార్టీషన్‌లో పగుళ్లు వచ్చినట్లు గుర్తించారని తెలుస్తోంది. కాగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సచివాలం నిర్మాణ బాధ్యతలు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే.