22-01-2025 12:46:46 AM
నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలి కార్మికుడు దుర్మరణం
మేడిపల్లి, జనవరి 21 (విజయక్రాంతి): నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో కార్మికుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తోటి కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని20వ డివిజన్ బండి గార్డెన్ వద్ద నిర్మాణంలో ఉన్న షేటర్స్ (వాణిజ్య సముదాయం)లో సెంట్రింగ్ తీస్తుండగా పై కప్పు కూలి అక్కడ పనిలో ఉన్న కార్మికులపై పడడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
కాగ మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన రాజు (47),గా నిర్దారించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రామంతపూర్ లో నివాసం ఉంటూ తోటి సెంట్రింగ్ కార్మికులతో పీర్జాదిగూడలో పనికి వచ్చినట్లు తోటి కార్మికులు తెలిపారు.మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ సందర్శన
నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి చెందిన సంఘటన తెలియగానే స్థానిక మున్సిపల్ కమీషనర్ త్రిలేశ్వర్ రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సదరు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని దీనిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.