ఐదుకు చేరిన మృతుల సంఖ్య
కొనసాగుతున్న సహాయక చర్యలు
కేదార్‌నాథ్ (డెహ్రాడూన్), సెప్టెంబర్ 10: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. సోమవారం కేదారీశ్వరుడి దర్శనం అనంతరం వెనక్కి వెళ్తున్న భక్తులపై మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడగా సమాచారం అందుకున్న ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం సాయంత్రానికి ఒక మృతదేహం వెలికితీయగా.. చీకటి పడటం, ఆ ప్రాంతంలో మరిన్ని రాళ్లు పడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను బలగాలు నిలిపివేశాయి. మరుసటి రోజు(మంగళవారం) రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగించగా మట్టిదిబ్బల్లో మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద ఇంకా అనేకమంది యాత్రికులు ఉండే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
మధ్యప్రదేశ్ వాసులే ఎక్కువ..
కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారిలో ఎక్కువగా మధ్యప్రదేశ్‌కి చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో మధ్యప్రదేశ్‌లోని ఘాట్ జిల్లాకు చెందిన దుర్గా బాయి ఖాపర్(50), ధార్‌కు చెందిన సమన్ బాయి(50), గోపాల్(50), నేపలాల్‌లోని ధన్యా జిల్లా వైదేహి గ్రామనికి చెందని తిత్లీ దేవి(70), సూరత్‌కు చెందిన భరత్ భాయ్ నిరాలాల్ (52) ఉన్నారు. ఈ ఘటన పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు.