calender_icon.png 20 April, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

20-04-2025 12:01:10 AM

ఢిల్లీలోని ముస్తాఫాబాద్‌లో ఘటన...

11కు పెరిగిన మృతుల సంఖ్య..

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్న అధికారులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. వీరిలో ఇద్దరు మహిళలున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం తహ్సీన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు అంతస్తుల భవనం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 22 మంది భవన శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు శిథిలాల కింది నుంచి 14 మందిని రక్షించి జీబీటీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారన్నారు.

శిథిలాల కింద పలువురు ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వారి కోసం సహాయక చర్యలను మరింత వేగతవంతం చేసినట్టు నార్త్ ఈస్ట్ జిల్లా డీఎస్పీ సందీప్ లంబా తెలిపారు. నాలుగు అంతస్తుల భవనం కూలినట్టు తెల్లవారుజామున 2:50 గంటలకు తమకు ఫోన్‌కాల్ వచ్చిందని డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి రాజేంద్ర అత్వాల్ పేర్కొన్నారు. ‘మేం ఘటనాస్థలికి వెళ్లేసరికే భవనం మొత్తం కూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు’ అని అత్వాల్ తెలిపారు. అయితే భవనం కుప్పకూలుతున్న దృశ్యాలు పక్క బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయినట్టు పేర్కొన్నారు.